శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం

శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం,PH:-9963653907,9949621214,9705934635,9705934633,9676453548.

జాతక చక్రం

28, ఏప్రిల్ 2010, బుధవారం

శుక్ర దోష నివారణా క్షేత్రం "తిరునావలీశ్వరాలయం


తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రముఖ శుక్రదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది.

విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.

మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం.

ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే కాగా... అమ్మవారిని సుందరనాయకి, మనోన్మణి అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.

మూల విరాట్టుపై సూర్య కిరణాలు:
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు.

ఆలయ ప్రాశస్త్యం విషయానికి వస్తే... ఒకానొక సందర్భంలో మునీశ్వరుల శాపానికి గురైన శుక్రుడు తిరునావలీశ్వర ఆలయంలోని స్వామివారిని పూజించి విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం శుక్రదోష విమోచన క్షేత్రంగా విలసిల్లుతోంది. శుక్ర దోషం ఉన్నవారు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

63 మంది నయనార్లలో ఒకరైన సుందరర్ జన్మస్థలం కూడా తిరునావలూరే కావడంతో, ఆలయం ఎదురుగా ఆయనకు ఒక ప్రత్యేక సన్నిధిని నెలకొల్పారు. అప్పట్లోనే ఈ ఆలయ ప్రాశస్త్యం శ్రీలంక వరకు వ్యాప్తి చెందడంతో, అక్కడి తమిళ రాజులు తిరునావలీశ్వర ఆలయానికి విరాళాలు కూడా అందజేసినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో మూడుపూటలా నిత్య పూజలను నిర్వహిస్తుంటారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి, రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరువబడి ఉంటుంది. నెలలో రెండు రోజులు ప్రదోష పూజలు.. మంగళ, శుక్ర వారాలలో అమ్మవారికి విశేష పూజలు.. ఏడాదిలో మహాశివరాత్రి లాంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నవగ్రహ సన్నిధి, భైరవుడు, గురు దక్షిణామూర్తి, నయనార్లు, అమ్మవారి సన్నిధులు వేరువేరుగా ఉన్నాయి.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు. సాధారణంగా ఆలయాల్లో గురు దక్షిణామూర్తి స్వామివారు కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిలబడిన భంగిమలో, వృషభంపై ఓ చేయి వేసి కనిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎలా వెళ్లాలంటే... తమిళనాడులోని చెన్నై నగరం నుంచి వెళ్లే భక్తులు బన్రుట్టి, విళుపురం నుంచి బస్సు మార్గంలో తిరునావలూరు వెళ్లవచ్చు. చెన్నై-తిరుచ్చి మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలోను... బన్రుట్టి నుంచి 18 కిలో మీటర్ల దూరంలోను, విళుపురం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోను తిరునావలూరు ఉంటుంది.

0 వ్యాఖ్యలు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి