శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం

శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం,PH:-9963653907,9949621214,9705934635,9705934633,9676453548.

జాతక చక్రం

25, ఏప్రిల్ 2010, ఆదివారం

పుణ్యక్షేత్రం అరసవల్లి


"ఆదిత్యుడి" పాదాలను స్పృశించే సూర్యకిరణాలు

ఉషోదయ కిరణాలతో సమస్త ప్రాణ కోటికి నూతన చైతన్యాన్ని నింపుతున్న సూర్యభగవానుడు ఆదిత్యునిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం అరసవల్లి. ఈ ఆలయంలో కొలువుదీరిన భాస్కర స్వామిని పూజించిన వారికి ఈతిబాధలు, సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఊరిని తొలుత "హర్షవల్లి" అనే వారని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. శ్రీ ఉషా, పద్మినీ, ఛాయాదేవి సమేతుడైన సూర్యనారాయణుడు సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.

రెండు చేతుల్లో అభయ ముద్రలను కలిగియుండే సూర్యనారాయణుడు, నడుముకు చురిక(కత్తి)తో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక గరుత్మంతుడి అన్న అయిన అనూరుడు (అంటే తొడలు లేని వాడు అని అర్ధం) సూర్యనారాయణుని రథానికి సారథిగా ఉంటాడు. అనూరుడికే అరుణుడనే మరో పేరుంది. స్వామి విగ్రహానికి ఇరు పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు.

"మహాభాస్కర క్షేత్రం"గా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని స్ధలపురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. గంగవంశరాజు గుణశర్మ వారసుడైన.. కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.


16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్రను ముందుగానే తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్‌ను ఒక బావిలో పడేశారట.

క్రీ.శ.1778లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్‌ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జిల్లాలోని ఆలుదు గ్రామస్తులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని(గోపురం) పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో ఆలయాన్ని నిర్మించారు.

మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో వచ్చే ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా "రథసప్తమి" నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1,2,3,4 తేదీల్లోనూ, స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అరసవల్లి ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారి పాదాల మీదుగా మొదలై, శరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే ఆ మనోహరమైన దృశ్యం అద్భుతం, అపురూపమని భక్తులు అంటూ ఉంటారు.

ఇకపోతే.. అరసవల్లి క్షేత్రాన్ని స్థానికులు ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు. ప్రత్యేకించి కంటి వ్యాధులు, బొల్లి, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు భాస్కర స్వామిని కొలుస్తుంటారు.

అరసవల్లికి ఎలా వెళ్లాలంటే..?
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అనే గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం పయనించాలి. శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు అరసవల్లికి చేరుకోవచ్చు.

ఇకపోతే.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి రైళు లేదా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. చెన్నై, కొల్‌కతా నగరాల నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి ప్రత్యేక రైళ్ల రాకపోకలున్నాయి.

అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, హౌరా, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, సికింద్రాబాద్‌ల నుంచి కూడా శ్రీకాకుళంకు రైళ్లు నడుస్తున్నాయి. హౌరా మెయిల్, విశాఖ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా శ్రీకాకుళం చేరుకుని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకోవచ్చు.

0 వ్యాఖ్యలు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి